రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. బాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం జరిగిన నూతన పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
“పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి. పోలీసు అంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన ప్రజల్లో కలిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలి” అని మంత్రి సవిత నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు.
ఈ దీక్షాంత్ పరేడ్‌లో తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 521 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. వీరిలో కడప పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 194 మంది సివిల్ ఎస్‌సీటీపీసీలు, 11వ బెటాలియన్‌కు చెందిన 327 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసిన కానిస్టేబుళ్ల నుంచి మంత్రి సవిత గౌరవ వందనం స్వీకరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. పరేడ్ మైదానంలో నూతన కానిస్టేబుళ్ల అడుగులు, కమాండుల సమన్వయం, శిక్షణలో పొందిన నైపుణ్యాలను ప్రతిబింబించాయి.

పోలీసు వ్యవస్థలో కానిస్టేబుళ్ల పాత్రను ప్రస్తావిస్తూ మంత్రి సవిత, కానిస్టేబుళ్లే మొత్తం పోలీసు వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తారని తెలిపారు. దీక్షాంత్ పరేడ్ కేవలం ఒక పరేడ్ కార్యక్రమం మాత్రమే కాదని, శిక్షణార్థి నుంచి బాధ్యతాయుతమైన పోలీసు సిబ్బందిగా మారే కీలక ఘట్టమని ఆమె అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ, సమన్వయం, ఆత్మవిశ్వాసం, విధి పట్ల అంకితభావాన్ని చాటిన నూతన కానిస్టేబుళ్లు ఇకపై ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు.

సుమారు 6 వేల మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో అనేక అడ్డంకులను అధిగమించి నియామకాలు చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లకు అందించే నెలవారీ స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,000కు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. పోలీసు యూనిఫాం గౌరవంతో పాటు అపారమైన బాధ్యతను కూడా ఇస్తుందని, ఆ బాధ్యతను నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే విధంగా పనిచేయాలని అధికారులు నూతన కానిస్టేబుళ్లను ప్రోత్సహించారు.














