కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిటోరియంలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చించారు.

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ మనోహర్ రెడ్డి అభ్యర్థిగా ఉంటారని అవినాష్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున రూపొందించిన ‘వెన్నుపోటు పార్టీ వెన్నుపోటు పాలన’ అనే మేనిఫెస్టోను ఆవిష్కరించారు. టీడీపీ పాలనలో జరిగిన పరిణామాలు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఈ మేనిఫెస్టోలో వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పులివెందులలో టీడీపీకి చెందిన 25 మంది చోటా లీడర్లకు గన్‌మెన్లు కేటాయించిన విషయాన్ని అవినాష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. క్రైమ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ గన్‌మెన్లను ఇప్పించారని ఆయన ఆరోపించారు. పోలీసుల సహకారంతో దండుపాళ్యం తరహా గ్యాంగ్‌ను ఎన్నికల సమయంలో రంగంలోకి దింపేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

స్థానిక ఎన్నికల్లో కుట్రలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని టీడీపీ యత్నిస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో క్రైమ్‌ను ప్రోత్సహించేలా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై ఒక్క దెబ్బ పడితే తిరిగి నాలుగు దెబ్బలు పడేలా ప్రజలు సమాధానం ఇస్తారని ఆయన పేర్కొన్నారు.

కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి రోజులు వస్తాయని అవినాష్ రెడ్డి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులు ఏకమై పనిచేస్తే టీడీపీ కుట్రలు విఫలమవుతాయని, పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

పులివెందులలో చోటామోటా నాయకులకు 25 మంది గన్‌మెన్లను ఇచ్చారు. క్రైమ్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గన్‌మెన్లను ఇచ్చారు.