రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప : డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాకు అందజేసిన ర్యాపిడ్ కిట్లు అమల్లోకి రాకుండానే మూలనపడ్డాయి. గడువు ముగిసిందన్న సాకుతో అధికారులు వాటిని వినియోగించకపోవడంతో, ఇదే సమయంలో రేషన్ మాఫియా మరింత రెచ్చిపోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా, ఎక్కడైనా పట్టుబడితే అది పీడీఎస్ బియ్యమేనా కాదా అన్నది తక్షణమే నిర్ధారించేందుకు గత ఏడాది అక్టోబరులో జిల్లావ్యాప్తంగా తొమ్మిది ర్యాపిడ్ కిట్లను పంపిణీ చేసింది. జమ్మలమడుగు, బద్వేలు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని ఏఎస్‌వోల వద్ద ఒక్కో కిట్, మిగిలిన ఏడు కిట్లు ఇతర నియోజకవర్గ కేంద్రాల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలకు అందజేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ కిట్ల వినియోగం దాదాపు నిలిచిపోయినట్టే ఉంది.
సాధారణ బియ్యానికి, ప్రభుత్వం అందించే చౌక బియ్యానికి స్పష్టమైన తేడా ఉంటుంది. పోర్టిఫైడ్ చేసిన పీడీఎస్ బియ్యంలో ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్, బీ-12 వంటి పోషకాలు కలిపి ఉంటాయి. ఎక్కడైనా అనుమానాస్పదంగా బియ్యం పట్టుబడితే ర్యాపిడ్ కిట్‌లోని రసాయనాలతో పరీక్షించాలి. పరీక్షలో బియ్యం ఎరుపు రంగులోకి మారితే దాన్ని పీడీఎస్ బియ్యంగా పరిగణించి కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధానం అమలులో లేకపోవడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిర్బంధం లేకుండా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో రేషన్ మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందించే ప్రతి కిలో బియ్యానికి ప్రభుత్వం సుమారు రూ.48 వరకు వ్యయం చేస్తోంది. అయితే అక్రమార్కులు లబ్ధిదారుల నుంచి కిలోను రూ.14 నుంచి రూ.17 మధ్య కొనుగోలు చేసి, తరువాత పాలిష్ చేయించి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలోను రూ.35 నుంచి రూ.45 వరకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు సమాచారం.
ప్రతి నెలా ప్రొద్దుటూరు కేంద్రంగా సుమారు పది వేల బస్తాల రేషన్ బియ్యం జిల్లా హద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్తోందని స్థానికంగా చర్చ నడుస్తోంది. జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు నియోజకవర్గాల పరిధిలో ఈ రేషన్ దందా ఎక్కువగా జరుగుతోందని అధికార వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.
ర్యాపిడ్ కిట్లలోని రసాయనాల గడువు ముగియడంతో ప్రస్తుతం వాటిని వినియోగించడం లేదని జమ్మలమడుగు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ గోవిందరావు మోరే వెల్లడించారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా అందజేసిన కిట్లు ఉపయోగం లేకుండా పోయాయని, అధికారులు నిర్లక్ష్య ధోరణి కారణంగానే రేషన్ మాఫియాకు మరింత ఆస్కారం లభించిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.













