రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: రాయలసీమ ప్రాంతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతంగా అవతరించేందుకు అవసరమైన అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ పేర్కొన్నారు. నీటి భద్రత, ఇంధన భద్రత, ఆర్థిక వనరులు, పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ఆయన విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. కడపలో నిర్వహించిన "రైజింగ్ రాయలసీమ" సదస్సులో ఆయన మాట్లాడుతూ..
ప్రతి వ్యక్తికి తన ప్రాంతం పట్ల అభిమానం ఉండాలని, రాయలసీమ అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, మేధావులు, ప్రజలు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ దిశగా రాయలసీమకు అనుకూల వాతావరణం సృష్టించడంలో వివిధ వేదికలు, కార్యక్రమాలు దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలకు నాయకత్వం వహించే మేధోసంపత్తి, యువశక్తి రాయలసీమకు ఉన్న గొప్ప సంపదగా సత్యకుమార్ వివరించారు. కాలుష్యరహిత వ్యవసాయం, నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తిలో రాయలసీమ రైతులు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే ఈ ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు.
రాయలసీమలో నీటి వనరులకు ఎలాంటి కొరత లేదని, సాగునీరు, తాగునీటి అవసరాలు భవిష్యత్తులో మరింత మెరుగుపడనున్నాయని సత్యకుమార్ తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానం, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరుగాంచిన రాయలసీమ నేడు ఉద్యాన పంటల కేంద్రంగా మారిందని మంత్రి చెప్పారు. రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు ఏర్పడుతూ వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
రూ.83 వేల కోట్ల పెట్టుబడులతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందులో గణనీయమైన భాగం రాయలసీమలోనే అమలవుతోందని సత్యకుమార్ తెలిపారు. దీంతో లాజిస్టిక్స్ రంగం బలోపేతమై మరిన్ని పెట్టుబడులు ఆకర్షితమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని, “హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్” లక్ష్య సాధనలో రాయలసీమ ప్రధాన భాగస్వామిగా నిలవాలని మంత్రి వై. సత్యకుమార్ ఆకాంక్షించారు.













