రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: YSR కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ నరికివేత, రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ దాడిలో 8 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి, 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.1.30 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఈ దాడి నిర్వహించారు. కడప టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్‌కు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా, పోరుమామిళ్ల సీఐ ఆర్.జి. సుబ్రహ్మణ్యంతో కలిసి ఎస్.ఎ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలోని గలనన్నుబోయిన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు.

అక్టోబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో జ్యోతి వైపు నుంచి మూడు వాహనాలు వస్తుండగా, పోలీసులు వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చుట్టుముట్టి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అక్కడి నుంచి పారిపోయారు.
అరెస్టయిన వారిలో పెరుమాళ్ (42), శక్తివేల్ పొట్టి (37), వెల్లయ్యన్ శ్రీనివాసన్ (43), అన్బళగన్ (46), సురేష్ (22), దురైసామి అన్నామలై (46), రఘు సెల్వకుమార్ (38), చాబోలు వెంకట కుమార్ (22) ఉన్నారు. వీరు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న 70 ఎర్రచందనం దుంగల బరువు సుమారు 1,984 కిలోలు కాగా, వాటి విలువ రూ.81,34,400గా అంచనా వేశారు. వీటితో పాటు కేఏ05 ఏకే 7082 నంబరు గల ఐచర్ కంటైనర్ విలువ రూ.28 లక్షలు, ఏపీ39 యూఎక్స్ 4068 నంబరు గల టూఫాన్ వాహనం విలువ రూ.16 లక్షలు, ఏపీ39 యూజీ 4466 నంబరు గల మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు విలువ రూ.5 లక్షలుగా పేర్కొన్నారు.
పోలీసులపై దాడికి ఉపయోగించిన ఐదు గొడ్డళ్లు, ఆరు రాళ్లు, కంటైనర్‌లో ఎర్రచందనం దుంగలను దాచేందుకు ఉపయోగించిన కాఫీ పౌడర్ అట్టపెట్టెలు 643 కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి మొత్తం విలువ రూ.1,30,34,400గా అంచనా వేశారు.

ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, ఎర్రచందనం దుంగలు, అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. వారిలో పోరుమామిళ్ల సీఐ ఆర్.జి. సుబ్రహ్మణ్యం, రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, పోరుమామిళ్ల ఎస్ఐ ఎ. విద్యాసాగర్, ఎస్.ఎ. కాశినాయన పోలీస్ స్టేషన్ ఎస్ఐ డాక్టర్ నాయక్, ఇతర సిబ్బంది ఉన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎర్రచందనాన్ని నరికినా, దాచినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా లేదా అక్రమ కార్యకలాపాలకు సహకరించినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పునరావృత నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు.













