రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా ప్రయత్నాన్ని అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు. కడప జిల్లా అటవీ శాఖాధికారి అందించిన ఖచ్చితమైన సమాచారంతో ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అధికారులు నాగసానిపల్లి బీట్, చిక్కి తిప్ప ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
అటవీ శాఖ సమాచారం ప్రకారం, తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు అటవీ సిబ్బంది గమనించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది స్మగ్లర్లపై మూకుమ్మడి దాడి చేశారు. అయితే అధికారులను చూసిన నిందితులు తమ వద్ద ఉన్న చెక్కలను అక్కడే వదిలేసి చీకట్లో పరారయ్యారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అక్కడ భారీగా ఎర్రచందనం దుంగలను గుర్తించారు. మొత్తం 234 కిలోల బరువు కలిగిన 7 చెక్కుడు చేసిన నాణ్యమైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ క్షేత్రాధికారి ఎం. హేమాంజలి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
పారిపోయిన స్మగ్లర్లను గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా, నిల్వ లేదా స్మగ్లింగ్‌కు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే సమీపంలోని అటవీ శాఖ కార్యాలయానికి సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
అటవీ సంపదను కాపాడటం కోసం ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, అక్రమంగా అటవీ ఉత్పత్తులను రవాణా చేసే వారిని సహకరించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై అటవీ శాఖ కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.













