రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడపలో సిపిఎం జిల్లా నాయకత్వానికి రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు కడప స్థానిక ఐక్య ఉపాధ్యాయ భవనం యుటిఎఫ్ మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, రాయలసీమ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్ ప్రారంభించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.అన్వేష్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, జి.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.గౌసియా బేగం, కే.సత్యనారాయణ, బి.దస్తగిరి రెడ్డి, కే.శ్రీనివాసలు రెడ్డి, లక్ష్మీ రాజా, లక్ష్మీదేవి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లాలోని సిపిఎం నాయకత్వం పెద్ద సంఖ్యలో హాజరైంది.

ఈ సందర్భంగా రాయలసీమ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్ దేశ పరిపాలన, రాజ్యాంగ విలువలు, శాస్త్రీయ దృక్పథం ప్రాముఖ్యతపై విస్తృతంగా మాట్లాడారు. భారత రాజ్యాంగం స్వాతంత్రోద్యమ త్యాగాల స్ఫూర్తికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథం పెంపొందేలా చూడటం పాలక ప్రభుత్వాల బాధ్యతగా ఆయన అభిప్రాయపడ్డారు.
“దేశ స్వాతంత్రోద్యమ త్యాగాల స్ఫూర్తికి ప్రతిరూపంగా భారత రాజ్యాంగం ఏర్పడింది. ప్రతి పౌరునికి శాస్త్రీయ దృక్పథం అలవర్చాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉంటుంది. దేశ అభివృద్ధి క్రమంలో ప్రజలు మానసికంగా, శారీరకంగా శాస్త్రీయ దృక్పథంతో శ్రమించాలి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర, సర్వసత్తాక, సామ్యవాద, సోషలిస్టు రాజ్యాంగాన్ని మన దేశ ప్రజా అనుకూల పూర్వపు మేధావులైన వారు శాస్త్రీయ రాజ్యాంగాన్ని మనకందించారు” అని తెలిపారు.
1952 నుండి ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన పాలకులు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు తగిన కృషి చేయలేదని ఆయన విమర్శించారు. గడిచిన 12 సంవత్సరాలుగా బిజెపి, మోడీ ప్రభుత్వం దేశంలో కుల, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టుతూ “ఓటు చోరీ” చేస్తోందని ఆరోపించారు. ప్రజల్లో ఉన్న నిరక్షరాస్యత, పేదరికం నుండి వారిని బయటపడేయడాన్ని పాలకులు విస్మరించారని అన్నారు.
దేశంలో ప్రస్తుతం అశాస్త్రీయ పరిపాలన కొనసాగుతోందని, దీనికి వ్యతిరేకంగా “కాక్రోచ్ విద్యార్థి ఉద్యమం” దేశవ్యాప్తంగా ఎదిగిందని డాక్టర్ గేయానంద్ గుర్తుచేశారు. బిజెపి వెనుక సంఘ పరివార్ హిందూత్వ ఫాసిస్ట్ శక్తులు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. వారికి ప్రత్యామ్నాయంగా హేతుబద్ధంగా ఆలోచించే, శాస్త్రీయ సోషలిస్టు వ్యవస్థ కోరుకునే కమ్యూనిస్టు ఉద్యమమే ఉందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు సమాజం ఉన్నతంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తారని డాక్టర్ గేయానంద్ అన్నారు. ప్రజలు నిత్యం ఎదుర్కొనే భౌతిక సమస్యల పరిష్కారానికి వీరు శ్రమిస్తున్నారని వివరించారు.
దేశంలో ఇంకా భూస్వామ్య అవశేషాలు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజల కష్టాలకు పరిష్కారాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన హేతుబద్ధమైన సోషలిస్టు వ్యవస్థలోనే ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారాలు సాధ్యమని నొక్కి చెప్పారు. ప్రజల్లో విస్తృతంగా వారి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాల కోసం ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.













