రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని కడప ఒకటవ పట్టణ సి.ఐ తిమ్మారెడ్డి నిర్వహించారు. మహిళలు, బాలికల రక్షణకు అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
శుక్రవారం ఉదయం కడప పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులకు ‘శక్తి’ యాప్ ప్రాముఖ్యత, దానిని ఎలా ఉపయోగించాలన్న అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల గురించి కూడా వివరించారు.
ఏదైనా అపాయం లేదా అనుకోని ఘటన జరిగి ప్రమాదంలో ఉన్నప్పుడు ‘శక్తి’ యాప్ ద్వారా తక్షణ సాయం పొందవచ్చని సి.ఐ తిమ్మారెడ్డి విద్యార్థులకు తెలియజేశారు. ఎస్.ఓ.ఎస్. బటన్, డయల్ 112 నంబర్‌కు కాల్ చేసిన తర్వాత కేవలం 10 నిమిషాల్లో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారని ఆయన వివరించారు.
మహిళల ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, బాల్య వివాహాల దుష్పరిణామాలు, మహిళల రక్షణకు సంబంధించిన నూతన క్రిమినల్ చట్టాల నిబంధనలు, మహిళల భద్రతలో పోలీసు శాఖ పాత్ర, చట్టపరమైన హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పోలీసు సేవలపై సమగ్ర అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు లేదా నేరాలకు గురైన వెంటనే దగ్గరలో ఉన్న మహిళా కార్యదర్శులను లేదా పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. చట్టాలపై అవగాహన పెంపొందించుకుని తమ హక్కులను వినియోగించుకోవడం ప్రతి మహిళకు అత్యంత ముఖ్యమని విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వము కల్పించిన చట్టాలను తెలుసుకుని తమ భద్రతను స్వయంగా కాపాడుకునేలా చైతన్యవంతులను చేశారు.
ATM సెంటర్ల వద్ద అపరిచితులకు ATM కార్డులు, పిన్ కోడ్ వంటి వివరాలు చెప్పకూడదని, ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సి.ఐ తిమ్మారెడ్డి సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లైంట్ నమోదు చేయాలని విద్యార్థులకు తెలిపారు.
తక్షణ సహాయం కోసం అందుబాటులో ఉన్న ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లను కూడా గుర్తు చేశారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100/112, పిల్లల రక్షణ కోసం చైల్డ్ లైన్ 1098, గృహ హింసకు 181, మహిళ వేధింపులకు 1091, సైబర్ నేరాల టోల్ ఫ్రీ 1930 నంబర్లు, అలాగే సైబర్ మిత్ర సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు.













