రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడపలో కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ సంస్మరణ సభ ఘనంగా జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు స్థానిక ఉపాధ్యాయ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి కామ్రేడ్ జి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు.
సభలో ప్రధాన వక్తగా సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళి పాల్గొని, సీతారాం ఏచూరి రాజకీయ ప్రయాణం, కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన పాత్రను విశదీకరించారు. 1974లో ఎస్ఎఫ్ఐ ద్వారా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఏచూరి, 1975లో సిపిఎం ప్రాథమిక సభ్యత్వం పొందారని ఆయన గుర్తుచేశారు. అనంతరం జె.ఎన్.యు. యూనివర్సిటీ విద్యార్థి సంఘ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి దేశ విద్యార్థి లోకాన్ని ఆకర్షించిన నాయకుడిగా ఎదిగారని వివరించారు.
1977లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో, నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించి, ఆమె నివాసాన్ని ముట్టడించేంతటి తీవ్ర పోరాటం నడిపిన యువ నాయకుడిగా సీతారాం ఏచూరి పేరుపొందారని కందారపు మురళి పేర్కొన్నారు. ఆ కాలంలో ఆయన పోరాటం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిందని అన్నారు.
దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో, కాంగ్రెస్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా, నేటి బిజెపి హిందూమత ఉన్మాద విధానాలకు ప్రతిస్పందనగా కేంద్రంలో మూడవ ప్రత్యామ్నాయ ప్రభుత్వాల కూటములను ఏర్పాటు చేయడంలో సిపిఎం కీలక పాత్ర పోషించిందని, ఆ ప్రక్రియలో సీతారాం ఏచూరి పాత్ర ప్రత్యేకమైందని ఆయన వివరించారు. వామపక్ష ఉద్యమంలో రివిజనిజం, అతివాదం, అవకాశవాద ధోరణులపై ఏచూరి నిరంతర పోరాటం సాగించారని చెప్పారు.
భారతదేశంలో సామాజిక న్యాయం సోషలిస్టు విధానాలతోనే సాధ్యమని, ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు ఉద్యమం అత్యవసరమని కందారపు మురళి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ రాజకీయాల్లో రష్యా, చైనా, భారత్ కీలక పాత్రలు వహించబోతున్నాయని సీతారాం ఏచూరి తన కాలంలోనే ముందుచూపుతో విశ్లేషించారని ఆయన గుర్తుచేశారు.
నేడు బ్రిక్స్ సమావేశాలకు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా మారడం, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాధాన్యం పెరగడం ఏచూరి ముందుచూపుకు నిదర్శనమని కందారపు మురళి వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.అన్వేష్, బి.మనోహర్, జీ.శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి.చాంద్ బాషా, బి.దస్తగిరి రెడ్డి, కే.శ్రీనివాసులు రెడ్డి, ఎస్.గౌసియా బేగం, కే.సత్యనారాయణ, లక్ష్మీ రాజా, ప్రజా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు ముంతాజ్ బేగం, శివరాం రెడ్డి, రవికుమార్, మహేష్ బాబు, కుమార్ స్వామి, రమణ, విజయ్, జకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీనివాసులు, సత్తా నాయకులు కృష్ణ, వామపక్షాల నాయకుడు రమణయ్య, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు.













