తెలుగుదేశం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనంగా కడప జిల్లా టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ ఇ. వినోద్ కుమార్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రొద్దుటూరు సివిల్ జడ్జెస్ కోర్టు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2020 నుంచి 2024 మధ్య కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంతో పాటు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన అనేక అక్రమ కేసులను కోర్టుల్లో వాదించి వారికి అండగా నిలిచిన వినోద్ కుమార్ సేవలను పార్టీ పరిగణనలోకి తీసుకుంది. లీగల్ సెల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్టీ కార్యకర్తల తరఫున పలు కీలక కేసుల్లో న్యాయపరంగా పోరాడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు వినోద్ కుమార్‌ను ప్రొద్దుటూరు సివిల్ జడ్జెస్ కోర్టు అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకంతో కడప జిల్లా టీడీపీ లీగల్ సెల్‌కు మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

తన నియామకంపై స్పందించిన వినోద్ కుమార్, పార్టీపై నమ్మకం ఉంచి అంకితభావంతో పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ బాధ్యత తనపై ఉంచిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

తన నియామకానికి సహకరించిన జిల్లా ఇంచార్జి మంత్రి సవిత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, న్యాయశాఖ మంత్రి ఎన్. ఎండి. ఫరూక్, జోనల్ కోఆర్డినేటర్ పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్. భూపేష్ రెడ్డిలకు వినోద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా లీగల్ సెల్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని వేళలా తనకు పూర్తి అండగా నిలిచి, ఈ పదవి దక్కేందుకు విశేష కృషి చేసిన ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇంచార్జి డాక్టర్ జి. వీర ప్రవీణ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.