టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్ రెడ్డికి బెదిరింపులు

పోలీసులకు ఫిర్యాదు

కడప : ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్ రెడ్డికి బెదిరింపు లేఖలు వచ్చినట్లు తెలుస్తోంది. స్పీడ్ పోస్టు ద్వారా తనకు బెదిరింపు లేఖ పంపినట్లు ప్రవీణ్‌ తెలిపారు. మా తాతను చంపినట్లే నన్నూ చంపుతామని ఆ లేఖలో బెదిరించారని చెప్పారు. దీనిపై ప్రవీణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ ఈశ్వర్ రెడ్డి పేరుతో బృందావన్ అపార్ట్ మెంట్, గోకుల్ నగర్, కొర్రపాడు రోడ్డు తప్పుడు అడ్రస్ తో ఎవరో స్పీడ్ పోస్టు లేఖ పంపారు. అందులో 1982 లో మా అబ్బ గండ్లూరు పెద్ద వీరారెడ్డి ఎలా హత్యకు గురయ్యారో అలాగే నన్ను ఇంట్లోనే చంపుతామని లేఖలో రాశారు. ఈ అడ్రస్ విచారించాము. ఇది తప్పుడు అడ్రస్, ఫోన్ నంబర్ తప్పే. అదేవిధంగా నా ఆప్తుడు పార్లపాడు చంద్ర ఎప్పుడు నాతోనే ఉంటాడు. అతన్నికూడా లేపుతామని లేఖ వచ్చింది. ఎవరైతే లేఖ పంపారో వారికి చెబుతున్నా.. నాది లేఖలకు భయపడే వంశం కాదు. తన చిన్నాన్న వీర శివారెడ్డి, చిన్నమ్మ లక్ష్మీదేవమ్మ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తమది రాజకీయ కుటుంబం. ఇటువంటి బెదిరింపులు దాటుకుని వచ్చాము. రాజకీయాలు చేస్తున్నాము. నా జోలికొస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. బెదిరింపు లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రవీణ్ చెప్పారు.