రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల దర్యాప్తు నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఈడీ అవినాష్‌రెడ్డిని ఆదేశించింది.
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డి, సునీలాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి తదితరులను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కేసుకు సంబంధించిన ఆర్థిక కోణంపై దర్యాప్తు మరింత ముమ్మరంగా కొనసాగుతోంది.
వివేకా హత్య కేసు నేపథ్యంలో సుమారు రూ.40 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ లావాదేవీల మూలం, డబ్బు ప్రవాహం, సంబంధిత వ్యక్తులు, సంస్థల పాత్రలపై ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డిని విచారణకు పిలుస్తున్నట్లు తెలుస్తోంది.
వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికే సెంట్రల్ Bureau అఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తులో ఉంది. క్రిమినల్ కోణంలో CBI విచారణ కొనసాగుతుండగా, ఆర్థిక లావాదేవీల అంశంపై ఈడీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. కేసుకు సంబంధించిన డబ్బు లావాదేవీలు, ఆస్తుల మార్పిడి, చెల్లింపుల వివరాలు వంటి అంశాలు ఈడీ దర్యాప్తు కేంద్రబిందువుగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈడీ నోటీసులు జారీ కావడంతో కడప రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. వైకాపా నేత, ఎంపీ అయిన అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవడం కేసు దర్యాప్తు దిశపై కొత్త ప్రశ్నలు తెరపైకి తెచ్చింది. అయితే ఈడీ నుంచి అధికారిక వివరాలు, విచారణకు సంబంధించిన స్పష్టమైన సమాచారం ఇంకా వెలువడలేదు.
వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రారంభం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు ప్రారంభం కావడంతో కేసు మరో దశలోకి అడుగుపెట్టినట్టుగా రాజకీయ, న్యాయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













