రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2026 ద్వారా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సీట్ల కేటాయింపు జాబితాను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ జాబితాలో యోగి వేమన విశ్వవిద్యాలయం పీజీ కోర్సుల్లో సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 24, 25 తేదీలలో విశ్వవిద్యాలయానికి హాజరుకావాలని ప్రవేశాల సంచాలకులు ప్రొ. వి. రామకృష్ణ సూచించారు.
సీట్లు కేటాయించిన అభ్యర్థులు ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో స్వీయ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్-రిపోర్ట్ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత మాత్రమే విశ్వవిద్యాలయానికి రావాలని సూచించారు.
సీటు కేటాయింపు పత్రాల కాపీలతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, గుర్తింపు పత్రాలు, విద్యార్హతల సర్టిఫికెట్లు, ర్యాంక్ కార్డు తదితరాలను తీసుకుని యోగి వేమన విశ్వవిద్యాలయానికి హాజరుకావాలని ప్రవేశాల విభాగం స్పష్టం చేసింది. నిర్దేశించిన తేదీల్లో రిపోర్ట్ చేయని అభ్యర్థుల ప్రవేశాలు రద్దు అయ్యే అవకాశముందని విశ్వవిద్యాలయ వర్గాలు సూచిస్తున్నాయి.
పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు సమయానికి సెల్ఫ్-రిపోర్ట్ పూర్తి చేసి, అన్ని అవసరమైన పత్రాలతో వైవీయూకు హాజరయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది. సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ విధానం, అవసరమైన పత్రాల జాబితా వంటి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.













