రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: యర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులు సూచించారు. గురువారం కలెక్టరేట్ ఛాంబర్‌లో యర్రగుంట్ల మున్సిపాలిటీ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా హాజరయ్యారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు.
మున్సిపాలిటీలో పన్ను వసూళ్లను వంద శాతానికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణంలో గుర్తించిన గుంతలను వెంటనే పూడ్చి, గుంతలు లేని రహదారులు ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఏఐఐబీ తాగునీటి పథకం, టిడ్కో గృహాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆమోదం పొందిన పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
పట్టణంలో రోజువారీగా ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. డంప్‌యార్డులో పేరుకుపోయిన పాత వ్యర్థాల తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పెండింగ్ దరఖాస్తులను నిబంధనల మేరకు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తుదారులు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా పారదర్శకంగా, సమయపాలనతో వ్యవహరించాలని సూచించారు.
మున్సిపాలిటీ పరిధితో పాటు సమీప గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం తదితర అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చేందుకు సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులు ఆదేశించారు.
పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వసతులను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా సేవలు అందించే దిశగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.













