రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖకు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనం అందుబాటులోకి వచ్చింది. జిల్లాకు కేటాయించిన ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ శనివారం కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో పూజలు నిర్వహించి, జెండా ఊపి ప్రారంభించారు.
నేర దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ద్వారా నేరస్థలంలోనే ఆధారాలను గుర్తించి, సేకరించి, భద్రపరచే అవకాశం కలుగుతుందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ద్వారా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మంజూరు చేసిన ఈ వాహనాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కేటాయించారు. ఆ క్రమంలో వై.ఎస్.ఆర్ కడప జిల్లాకు కేటాయించిన వాహనం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంది.
వాహనాన్ని పరిశీలించిన ఎస్పీ, అందులో ఏర్పాటు చేసిన పరికరాలు, వాటి పనితీరు, నేరస్థలంలో ఆధారాల సేకరణకు వాటి ఉపయోగం వంటి అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేరం జరిగిన అనంతరం సంఘటనా స్థలంలో లభించే చిన్న ఆధారం కూడా కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉండటంతో, అలాంటి ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో గుర్తించి సేకరించేందుకు ఈ మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు.

ఈ వాహనంలో హై ఇంటెన్సిటీ లైట్లు, రక్తపు ప్రాథమిక పరీక్ష మరియు సేకరణ కిట్లు, డీఎన్‌ఏ నమూనాల సేకరణ కిట్లు, మాదకద్రవ్యాలు మరియు పేలుడు పదార్థాల స్క్రీనింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ట్రేస్ ఎవిడెన్స్‌ను గుర్తించి పరిశీలించేందుకు స్టీరియో మైక్రోస్కోప్, నేరస్థలాన్ని శాస్త్రీయంగా డాక్యుమెంట్ చేసేందుకు డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరా, సీసీటీవీ/డాష్‌బోర్డ్ కెమెరా, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కిట్, ఫోరెన్సిక్ ఇమేజర్, పెన్‌డ్రైవ్‌లు, మెమరీ కార్డులు, ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, డిజిటల్ డివైస్‌ల అక్విజిషన్, ఇమేజింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.
నేరస్థలం నుంచి ఆధారాలను సేకరించడంలో ఆలస్యం జరిగితే అవి దెబ్బతినే లేదా మార్పులకు గురయ్యే అవకాశం ఉండటంతో, సంఘటనా స్థలంలోనే ఆధారాలను గుర్తించి, సేకరించి, భద్రపరచడం ద్వారా కేసు దర్యాప్తును మరింత పటిష్టం చేయడానికి ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, లభించిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా కేసుల దర్యాప్తును బలోపేతం చేసి, న్యాయస్థానాల్లో నేర నిరూపణకు అవసరమైన ఆధారాలను సమర్థవంతంగా అందించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని కేటాయించినందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్‌కు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో నేర దర్యాప్తు వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్, డి.సి.ఆర్.బి సి.ఐ ఈశ్వర్ రెడ్డి, ఆర్.ఐ సోమశేఖర్ నాయక్, ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్, బద్వేలు రూరల్ సి.ఐ కృష్ణయ్య, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయం, కడపలో జరిగింది.













