రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప రాష్ట్రంలో క్రీడా రంగానికి ఆదర్శంగా నిలిచిన వైఎస్సార్ క్రీడా పాఠశాల ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఒకప్పుడు నాణ్యమైన విద్య, మెరుగైన క్రీడా శిక్షణకు చిరునామాగా ఉన్న ఈ పాఠశాల ప్రాభవం క్రమంగా తగ్గిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మౌలిక వసతుల లేమి, సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోగా, డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతున్నదని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు ప్రవేశాల కోసం పోటీ పడే ఈ పాఠశాలలో విద్యతో పాటు పౌష్టికాహారం, వివిధ క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించేవారు. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో చాలామంది ఒకటి, రెండు సంవత్సరాలకే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు తీసుకుని ఇతర పాఠశాలలకు మారిపోతున్నారని సిబ్బంది వర్గాలు చెబుతున్నాయి.
గత మూడు విద్యా సంవత్సరాలుగా డ్రాపౌట్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గత విద్యా సంవత్సరంలో ఒక్కసారిగా 57 మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయడం, ఇతర పాఠశాలలకు మారడం పట్ల అధికారులు పెద్దగా స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
క్రీడా సామగ్రి, దుస్తుల సరఫరా మూడు సంవత్సరాలుగా నిలిచిపోయిందని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో కొందరు తమ ఖర్చులతోనే క్రీడా సామగ్రి, యూనిఫాంలు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వస్తోందని వారి వాదన. బాలురు, బాలికల హాస్టళ్లకు కలిపి ఇద్దరు వార్డెన్లు మాత్రమే ఉండటంతో విద్యార్థుల భద్రత, శ్రేయస్సు పరంగా సమస్యలు తలెత్తుతున్నాయని సూచిస్తున్నారు.
అథ్లెటిక్స్, హాకీ, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, స్మిమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ, వాలీబాల్ వంటి అనేక క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తున్నప్పటికీ, ఖేలో ఇండియా పేరుతో కొన్ని క్రీడల్లో విద్యార్థులకు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆసక్తి తగ్గిపోతున్నదని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో నర్స్ పోస్టు కొంతకాలంగా ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు తక్షణ వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
కడపలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్నప్పటికీ, విద్యార్థులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు క్రీడా పాఠశాల సిబ్బంది చొరవ చూపడం లేదని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాల ప్రతిష్ఠ దెబ్బతింటోందని, రాష్ట్ర స్థాయి క్రీడాకారుల తయారీ కేంద్రంగా ఉన్న ఈ సంస్థను పునరుజ్జీవింపజేయాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి జగన్నాథరెడ్డి డ్రాపౌట్ల స్థానాలను భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న 57 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. లాటరల్ ఎంట్రీ ఎంపిక పరీక్షల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి లభించిందని చెప్పారు.













