వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ర్యాలీలు నిర్వహించడం, కార్యకర్తలను గుంపులుగా సమీకరించడం వంటి అంశాలపై పోలీసులు వైఎస్సార్సీపీ కీలక నేతలకు నోటీసులు జారీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. నామినేషన్ ప్రక్రియ సమయంలో ర్యాలీలు నిర్వహించకూడదని, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో ఒకేచోట గుంపుగా ఉంచవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా కడపలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు.

నామినేషన్ కేంద్రాల వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన TDP కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వందల మంది TDP మూకలు నామినేషన్ కేంద్రాల వద్ద తిరుగుతూ, ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు YSRCP నేతలపై మాత్రమే కఠినంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

నామినేషన్లు పడకుండా అడ్డుకునేందుకు భారీ కుట్ర జరుగుతోందని YSRCP వర్గాలు ఆరోపిస్తున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యర్థి కార్యకర్తల గుంపులు, నినాదాలు, ఒత్తిడి వాతావరణం కారణంగా తమ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయలేకపోతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ అభ్యర్థులకు రక్షణ కల్పించి, స్వేచ్ఛగా నామినేషన్లు వేయేలా చూడాలని వారు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసుల ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఒకే పార్టీ కార్యకర్తల గుంపులపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని YSRCP వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని పార్టీలకు సమాన న్యాయం జరిగేలా, ప్రతి అభ్యర్థి నిర్భయంగా నామినేషన్ వేయగల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని వారు పేర్కొంటున్నారు.