రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప నగరంలో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. కడప నగరంలోని ఆర్కే నగర్‌లో 4వ డివిజన్‌కు సంబంధించిన సమావేశాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, ప్రతి డివిజన్‌లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, ఎస్‌ఈసీ సభ్యుడు యానాదయ్య, ఈస్ట్ జోన్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ప్రతి డివిజన్‌లో పార్టీ బలాన్ని పెంచే దిశగా కృషి చేయాలని నాయకులు సూచించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితిలో ఉందని తెలిపారు. పార్టీకి ప్రజాబలం, కార్యకర్తల బలం రెండూ ఉన్నాయని, ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చడంతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, పాలనలో కనిపిస్తున్న వైఫల్యాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు.
“అక్రమ కేసులకు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది”
అని నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
అధికారం శాశ్వతం కాదని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. కడప నగరంలోని 66 డివిజన్లలో పార్టీని మరింత బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ పార్టీ ఐడీ కార్డులు అందజేస్తామని నాయకులు తెలిపారు. ప్రతి పార్టీ సభ్యుడికి ఐడీ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కడప ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం తప్ప కడప నగర అభివృద్ధికి చేసిన పని శూన్యమని ఎస్.బి. అంజాద్ బాషా విమర్శించారు. కడప నగర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కేవలం మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా, కడప అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో కడప ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఎస్.బి. అంజాద్ బాషా డిమాండ్ చేశారు.













