అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు బావిలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు, గ్రామస్తుల సహకారంతోఆయన మృతదేహాన్ని గుర్తించారు.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య (72) జులై 31న కూలి పనుల కోసం ఇంటి నుంచి వెళ్లారు. అయితే ఆ రోజు సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. దూర ప్రాంతానికి పనికి వెళ్లి ఉంటారని భావించారు.

అయితే ఆగస్టు 1న ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ తీసుకోకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. వెంటనే ఆయన కోసం బంధువులు, పరిచయస్తుల వద్ద విచారణ జరిపినా ఎటువంటి సమాచారం లభించలేదు. గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా గాలించినప్పటికీ వెంకటయ్య ఆచూకీ దొరకలేదు.

ఈ నేపథ్యంలో మంగళవారం గొల్లపల్లి సమీపంలోని బావిలో ఒక మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించగా, అది వెంకటయ్యదేనని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు లక్కిరెడ్డిపల్లె పోలీసులు తెలిపారు. వెంకటయ్య ఎలా బావిలో పడ్డారు, ప్రమాదవశాత్తూ పడ్డారా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

ఆకస్మికంగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో వెంకటయ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామంలో కూడా ఈ ఘటనపై చర్చ జరుగుతోంది. ఒంటరిగా తిరిగే వృద్ధులు, మద్యం సేవించి బావుల దగ్గరికి వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి బావులపై రక్షణ కంచెలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.