మైదుకూరు తాలూకా ఎ పి ఎన్ జీ జి ఓల అత్యవసర సమావేశం మైదుకూరు మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. మైదుకూరు తాలూకా యూనిట్ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశానికి ఎ పి ఎన్ జీ జి ఓ అధ్యక్షుడు చంద్రమౌళి అధ్యక్షత వహించారు.

సమావేశంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల సమస్యలు, వారి హక్కులు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో ఎ పి ఎన్ జీ జి ఓ సంఘం, ఎ పి జె ఎ సి పాత్ర, వాటి బలగం, ప్రభుత్వంపై ఇవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను సభ్యులు ప్రస్తావించారు.

చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎ పి ఎన్ జీ జి ఓ సంఘం, ఎ పి జె ఎ సి అత్యంత పెద్ద ఉద్యోగి సంఘాల వ్యవస్థలుగా ఉన్నాయని వివరించారు. దాదాపు రెండు వందల సంఘాలు ఈ వ్యవస్థలో భాగమై ఉన్నాయని, ఎనభై నుండి తొంభై శాతం వరకు ఉద్యోగి సంఘాలు ఈ సంస్థల పరిధిలోనే ఉన్నాయని ఆయన సభ్యులకు తెలియజేశారు.

ఉద్యోగులకు రావలసిన ఆర్థిక వనరులు, ప్రయోజనాలు అమలు విషయంలో ప్రభుత్వం తీవ్రమైన ఆలస్యం చేస్తోందని సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా జిపిఎఫ్, ఎపిజి ఎల్ ఐ, సరెండర్ లీవ్‌లు, ఇప్పటికే ఐదు పెండింగ్‌లో ఉన్న డి ఎలు, ఐ ఆర్, పిఆర్సి తదితర అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని సభ్యులు పేర్కొన్నారు.

ఈ విషయాలను రాష్ట్ర ఎ పి ఎన్ జీ జి ఓ అసోసియేషన్ అధ్యక్షులు అలపర్తి విద్యా సాగర్, జనరల్ సెక్రటరీ డి వి రమణ పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంకా నిర్ణయాలు వెలువడకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోందని చంద్రమౌళి సభ్యులకు వివరించారు.

ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయినా ఉద్యోగుల న్యాయమైన కోరికలు నెరవేరకపోవడంతో వారు సహనం కోల్పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను తక్షణం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.

సమావేశంలో మైదుకూరు తాలూకా యూనిట్‌కు చెందిన పలువురు నాయకులు, సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే భవిష్యత్తులో మరింత కఠిన చర్యల దిశగా వెళ్లే అవకాశాన్ని కూడా వారు పరిశీలించారు.