మైదుకూరు మండలం వనిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని పట్ల హిందీ ఉపాధ్యాయుడు ఎస్.ఎం. భాష అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిని వెంటనే విధుల నుండి తొలగించి, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.

బుధవారం ఉదయం ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దిన్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. వనిపెంట ZP హై స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎస్.ఎం. భాష, అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలపై చేతులు వేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు.

ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన విద్యార్థిని ఏడుస్తూ జరిగిన విషయాన్ని పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులకు తెలపగా, వారు హిందీ ఉపాధ్యాయుడు ఎస్.ఎం. భాషతో విద్యార్థినికి క్షమాపణలు చెప్పించి రాజీ ప్రయత్నం చేయడం ఉపాధ్యాయ వృత్తికి మచ్చ అని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతను కాపాడాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి ఘటనలను రాజీతో ముగించేందుకు ప్రయత్నించడం తీవ్రంగా ఖండించారు.

పాఠశాలలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపుల ఘటన ప్రధాన ఉపాధ్యాయుడు దృష్టికి వెళ్లినప్పటికీ, ఆయన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా, హిందీ ఉపాధ్యాయుడికి మద్దతు ఇస్తూ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం దారుణమని వారు విమర్శించారు. ఇలాంటి వ్యవహారంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలంటే భయపడే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటం సమాజం తలదించుకునే సంఘటనగా వారు అభివర్ణించారు. విద్యార్థుల భద్రతకు పాఠశాలలు సురక్షిత స్థలాలుగా ఉండాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన హిందీ ఉపాధ్యాయుడు ఎస్.ఎం. భాషను వెంటనే విధుల నుండి తొలగించి, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు మరోసారి డిమాండ్ చేశారు. డిమాండ్‌ను ప్రభుత్వం, విద్యాశాఖ పట్టించుకోకపోతే విద్యార్థులతో కలిసి ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.