రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27వ తేదీన మైదుకూరు పట్టణంలోని మేధా డిఫెన్స్ అకాడమీ ప్రాంగణంలో కడప జిల్లాలో సాగునీటి వనరులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర అనే అంశంపై రైతు సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో రైతులు, ప్రజా సంఘాలు, రైతు శ్రేయోభిలాషులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సేవా సమితి నాయకులు పిలుపునిచ్చారు.
ఈ మేరకు మైదుకూరు పట్టణంలో రైతు సేవా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ, రైతు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా సాగునీటి సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల స్థితిగతులపై ఈ సమావేశంలో చర్చించారు.
సమావేశంలో పాల్గొన్న ఏవి. రమణ మాట్లాడుతూ కడప జిల్లా నుండి వందల టీఎంసీల నీళ్లు కుందు, పెన్నా నదుల ద్వారా సోమశిల, చెన్నై ప్రాంతాలకు వెళుతున్నాయని, అదే సమయంలో కడప జిల్లాలో ఉన్న కెసి కెనాల్ , తెలుగు గంగ ఆయకట్టు రైతులు శ్రీశైలం జలాలపై మాత్రమే ఆధారపడి పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని వివరించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుందు నదిపై రాజోలి , జోలాడరాసి పేరుతో ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నించి, శంకుస్థాపన చేసి, నిధులు కూడా కేటాయించారని గుర్తుచేశారు.
రమణ పేర్కొన్నదేమనగా, రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు, ప్రస్తుతం పాలిస్తున్న వారు ఈ ప్రాజెక్టులపై స్పందించకపోవడంతో రాజోలి , జోలాడరాసి ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో కడప జిల్లా రైతులకు ఈ రెండు ప్రాజెక్టుల అవసరం ఎంత కీలకమో స్పష్టంగా తెలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పై రెండు ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రైతు సేవా సమితి భావిస్తున్నది. ఈ లక్ష్యంతో సెప్టెంబర్ 1వ తేదీ నుండి రైతు సేవా సమితి "రైతు గ్రామబాట" పేరుతో మండలాల వారీగా, గ్రామాల వారీగా పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. మండల రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దార్‌లకు వినతిపత్రాలు అందజేసి, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ఈ చర్యలన్నింటి సమగ్ర సమీక్ష, భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పన కోసం సెప్టెంబర్ 27వ తేదీ రైతు సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా రాయలసీమ సాగు నీటి సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామీ రెడ్డి, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు, హై కోర్ట్ లాయర్ రామ్ కుమార్ హాజరుకానున్నారు.













