మైదుకూరు: కిడ్నాప్ కేసు ఆరోపణలపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తనపై నమోదైన కిడ్నాప్ కేసు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే సృష్టించబడిందని, ఇందులో వైసీపీ నాయకుల కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.

సుధాకర్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ, వైసీపీ నాయకులు కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని, కిడ్నాప్ కేసు నమోదైన విషయం కూడా మొదట సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందని తెలిపారు. తాను హైదరాబాదులో ఉండగా, బెంగళూరులో కిడ్నాప్ చేశాడని ఆరోపించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

డాక్టర్ రవి ప్రకాష్ కేసు నేపథ్యంలో ఈ ఆరోపణలు వస్తున్నాయని, ఆయనను పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితిలో తాను కిడ్నాప్ చేశాడని చెప్పడం అసంబద్ధమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం వైసీపీ కల్పిత కథనమని, దీనికి వాస్తవాధారాలు లేవని అన్నారు.

డాక్టర్ రవి ప్రకాష్‌తో భూవివాదం ఉన్న విషయం నిజమేనని, 2021లో ఆయనే ఆ స్థలాన్ని తమకు విక్రయించారని సుధాకర్ యాదవ్ వివరించారు. అనంతరం రవి ప్రకాష్ దురుద్దేశంతో రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించారని, కింది కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ, పైకోర్టులో వివాదం కొనసాగుతోందని తెలిపారు.

కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో తాను బాధ్యత గల పౌరుడిగా, శాసనసభ్యుడిగా చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించనని సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో కిడ్నాప్ ఆరోపణలు మోపడం వైసీపీ రాజకీయ నాటకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

గత నెలలో ఉప్పుగుంట పల్లెలో తమ మేనేజర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణపై జరిగిన దాడి కేసులో పోలీసులు అరెస్టులు చేయకపోవడాన్ని కప్పిపుచ్చేందుకు, ఇప్పుడు కిడ్నాప్ ఆరోపణల కథను సృష్టించారని ఆయన విమర్శించారు. ప్రజలు ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని సుధాకర్ యాదవ్ అభిప్రాయపడ్డారు.

నాపై కిడ్నాప్ ఆరోపణలు చేయడం వైసిపి ఆడిన నాటకమే. వైసీపీ నాయకులు పనికట్టుకుని బురదజల్లే ప్రయత్నం చేశారు. నాపై కిడ్నాప్ కేసు పెట్టారన్న విషయం సామాజిక మాధ్యమాల ద్వారానే తెలిసింది. నేను హైదరాబాదులో ఉంటే బెంగళూరులో ఎలా కిడ్నాప్ చేస్తాను. డాక్టర్ రవి ప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేస్తే నేను ఎలా కిడ్నాప్ చేస్తాను. ఆయన ఆత్మను ఏమైనా కిడ్నాప్ చేశాను అనుకున్నారేమో. కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఒక బాధ్యతగల శాసనసభ్యునిగా చట్టాన్ని గౌరవిస్తాను. కిడ్నాప్ వ్యవహారమంతా వైసిపి కల్పితమే. డాక్టర్ రవి ప్రకాష్‌కు మాకు స్థల విషయంలో వివాదం ఉన్న మాట వాస్తవమే. 2021లో రవి ప్రకాష్ మాకు ఆ స్థలాన్ని అమ్మేశాడు. కానీ దుర్బుద్ధితో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మళ్లీ పైకోర్టుకు అప్లై చేయడంలో కోర్టులో వివాదం నడుస్తుంది. కోర్టు వివాదంలో ఉండంగా నేను బాధ్యత గల పౌరునిగా చట్టాన్ని గౌరవిస్తానే కానీ చట్టాన్ని అతిక్రమించను. గత నెలలో ఉప్పుగుంట పల్లెలో మా మేనేజర్‌గా ఉన్న మురళీకృష్ణపై దాడి చేయడం పై పోలీసులు అరెస్టు చేయకపోతే నేను కిడ్నాప్ చేశాను అనడం దారుణం. కిడ్నాప్ వ్యవహారమంతా వైసిపి ఆడిన నాటకమే కానీ మరొకటి లేదు. ఈ విషయం ప్రజలు గమనిస్తున్నారు, తగిన విధంగా గుణపాఠం చెబుతారు.