మైదుకూరు: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన ఐక్య పోరాటం ఫలితమిచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను విడుదల చేస్తూ విద్యుత్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని AP ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఎలక్ట్రిసిటీ స్త్రుగ్గ్లె కమిటీ హర్షంతో స్వాగతించింది.

సోమవారం సాయంత్రం దువ్వూరులోని C.V.V. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నాయబ్ రసూల్, YSR కడప జిల్లా అధ్యక్షులు బి.ఎన్. నాగసుబ్బయ్య, డిస్కోమ్ ఉపాధ్యక్షులు శీలం సుబ్బరాయుడు ఈ విషయంపై వివరాలు వెల్లడించారు.

నాయకులు మాట్లాడుతూ, యాజమాన్యం చాలా కాలంగా డీఏలను విడుదల చేయకుండా మొండివైఖరి ప్రదర్శించిందని, దీనికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా పోరాటం చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో నిర్వహించిన ‘చలో తిరుపతి ’, ‘చలో విజయవాడ ’ కార్యక్రమాలకు కార్మికుల నుంచి లభించిన విశేష స్పందనే యాజమాన్యం నిర్ణయాన్ని మార్చుకునేలా చేసిందని వారు పేర్కొన్నారు.

కార్మికుల ఐక్యత ముందు ఏ శక్తీ నిలవలేదని, ఈ పరిణామం మరోసారి నిరూపించిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యుత్ ఉద్యోగి, కార్మికుడికి స్ట్రగుల్ కమిటీ తరఫున అభినందనలు తెలిపారు. డీఏల విడుదలతో ఉద్యోగులపై ఉన్న ఆర్థిక భారం కొంత తగ్గుతుందని, ఇది పోరాటానికి మొదటి విజయంగా భావిస్తున్నామని నాయకులు చెప్పారు.

ఇదిలా ఉండగా, గత 22 రోజులుగా తిరుపతి CMD కార్యాలయం వద్ద బిల్ కలెక్టర్లు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు స్ట్రగుల్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బిల్ కలెక్టర్ల సమస్యలు న్యాయసమ్మతమైనవేనని, వారి డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం సీరియస్‌గా తీసుకోవాలని నాయకులు కోరారు.

బిల్ కలెక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. వారి సమస్యలను పరిష్కరించకుండా ఆలస్యం చేస్తే, స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు.

విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన హక్కుల కోసం స్ట్రగుల్ కమిటీ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు.