రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: మైదుకూరు: మైదుకూరు పట్టణ పరిధిలోని విశ్వనాథపురం సమీప బైపాస్ రోడ్డుపై భారీ వినాయక విగ్రహాన్ని తరలించే సమయంలో అపశృతి చోటుచేసుకుంది. హైవే స్వాగత ఆర్చి వద్ద విగ్రహం ఎత్తు ఎక్కువగా ఉండటంతో వాహనం ముందుకు కదలలేకపోయింది. కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం ప్రొద్దుటూరులో సుమారు 20 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహాన్ని రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ విగ్రహాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేటకు తరలించేందుకు ప్రత్యేక వాహనంపై లోడ్ చేసి బయలుదేరారు. మైదుకూరు బైపాస్ మార్గంగా నాయుడుపేట వైపు వెళ్తుండగా విశ్వనాథపురం సమీపంలోని హైవే స్వాగత ఆర్చి వద్ద విగ్రహం చిక్కుకుంది.
విగ్రహం శిరస్సు పైన అమర్చిన చక్రం కారణంగానే ఎత్తు పెరగడంతో ఆర్చి కిందుగా వెళ్లే సమయంలో ఇరుక్కుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వాహనం అక్కడికక్కడే ఆగిపోయి, కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలిసిన పోలీసులు, రహదారి శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తదుపరి విగ్రహానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ శిరస్సు పైన ఉన్న చక్రాన్ని తొలగించారు. అనంతరం వాహనాన్ని నెమ్మదిగా ముందుకు కదిలించి బైపాస్ మార్గంలో నుంచి బయటకు తీసుకెళ్లారు. చక్రాన్ని మళ్లీ సురక్షితంగా అమర్చిన తర్వాత విగ్రహాన్ని గమ్యస్థానమైన నాయుడుపేటకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటనను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భారీ వినాయక విగ్రహం, బైపాస్ ఆర్చి మధ్య ఇరుక్కుపోయిన దృశ్యాలు కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. విగ్రహాన్ని సురక్షితంగా బయటకు తీసిన తర్వాత మాత్రమే రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించినట్లు పోలీసులు తెలిపారు.













