రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా "మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ)" ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభం కానుందని ఎంపీజే నాయకులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఎంపీజే నాయకులు ఈ ఉద్యమాన్ని సెప్టెంబర్ 21 నుండి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని "అవినీతిని ప్రశ్నిద్దాం - జవాబుదారీతనం సాధిద్దాం" మరియు "ప్రజా ధనం - ప్రజల హక్కు" అనే ప్రధాన నినాదాలతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
అవినీతిని ప్రశ్నిద్దాం - జవాబుదారీతనం సాధిద్దాం
ప్రజా ధనం - ప్రజల హక్కు
ప్రజల పన్నుల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి వినియోగం కావాల్సిన సమయంలో, ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాలు, కాంట్రాక్టులు, కొనుగోళ్లు, లబ్ధిదారుల ఎంపిక వంటి రంగాల్లో అక్రమాలు, లంచాలు, కమీషన్ల రూపంలో దుర్వినియోగం అవుతున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేని పనులు జరగడం, నాణ్యమైన అభివృద్ధి పనులు అమలు కావడం, పథకాల నిధులు నిజమైన అర్హులకు చేరడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఎంపీజే నాయకులు స్పష్టం చేశారు.
రెవెన్యూ, మున్సిపల్, గృహనిర్మాణం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, గనులు, పౌర సరఫరాలు, రవాణా, పోలీస్, విద్యుత్ శాఖలతో పాటు అన్ని రంగాల్లో నాసిరకం పనులు, అవినీతి పెరిగిపోవడం వల్ల దేశాభివృద్ధి కుంటుపడి భవిష్యత్తు అంధకారమవుతోందని వారు పేర్కొన్నారు.
అవినీతి కేసుల్లో పార్టీ, కులం, హోదా, అధికారంతో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, గత రెండేళ్లలో అవినీతి నిరోధక శాఖ (ACB) తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా ఎంపీజే నాయకులు డిమాండ్ చేశారు.
అవినీతిని కనుగొని నిర్మూలించుట దేశ అభివృద్ధికి తోడ్పడుదాం
అవినీతి నిర్మూలన కోసం ప్రతి పౌరుడు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ప్రజలంతా ఈ అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని ఎంపీజే నాయకులు పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు.













