రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రొద్దుటూరు పట్టణంలో వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజల భద్రత కోసం మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంలో ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను కమిషనర్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, గృహాలకు అవసరమైన నిత్యావసర సరుకులను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
వర్షాల సమయంలో ఎలక్ట్రికల్ వైర్లు, కరెంటు స్థంబాలను తాకరాదని హెచ్చరించారు. కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, పరిస్థితులను బట్టి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉండడంతో తాగునీటి నిల్వలను ముందుగానే ఉంచుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లకు చార్జీలు ఉంచుకోవడంతో పాటు పవర్ బ్యాక్ అప్ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఎక్సపెక్టెడ్ డేట్ డెలివరీ ఉన్న మహిళలు తప్పనిసరిగా ముందుగానే వైద్య సహాయం పొందాలని కమిషనర్ తెలిపారు. భారీ వృక్షాల క్రింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని, ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు సమీప వార్డు సచివాలయానికి సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
అధికారులు అందరూ విధుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారని, డ్రైన్లు నిండిపోవడం, రోడ్లపై నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు కనిపించిన వెంటనే కమిషనర్‌కు, మున్సిపాలిటీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు, సిబ్బంది 24x7 ప్రజాప్రయోజనార్థం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మున్సిపాలిటీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. సమస్యలు ఉంటే 9849906669 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇప్పటికే వాటర్ వర్క్స్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి సూచనల మేరకు ప్రొద్దుటూరు ప్రజలకు వర్షాల ప్రభావం వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ ద్వారా అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.













