రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీల మద్దతు కోసం కృషి చేస్తోందని, అయితే ప్రొద్దుటూరులో మాత్రం భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అభిప్రాయపడ్డారు. బీసీలను కించపరిచేలా, భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.
గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో బీసీ నేత చల్లార రాజగోపాల్ యాదవ్‌పై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బచ్చల పుల్లయ్య సహా పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ లాభాల కోసం ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేయకూడదని సూచించారు. రాజగోపాల్ యాదవ్ చెప్పని మాటలను కూడా ఆయనకు ఆపాదిస్తూ, బీసీలను చులకనగా మాట్లాడటం మంచి సంప్రదాయం కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో హుందాతనం, పరస్పర గౌరవం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పార్టీలు వేర్వేరుగా ఉండవచ్చని, నాయకులు ఎవరైనా కావొచ్చని, అయితే రాజకీయ విభేదాల పేరుతో ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని బచ్చల పుల్లయ్య స్పష్టం చేశారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని భయపెట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచనను విడిచిపెట్టాలని ఆయన సూచించారు.
“నరికేస్తాం.. కోస్తాం.. తంతాం” వంటి భయపెట్టే వ్యాఖ్యలు చేస్తే బీసీలు భయపడి పడి ఉంటారనే భావనను పక్కన పెట్టాలి
గతంలో కూడా బీసీలపై ఇలాంటి వ్యాఖ్యలు, వివక్షకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయని బచ్చల పుల్లయ్య గుర్తుచేశారు. బీసీలను అనగదొక్కే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బచ్చల పుల్లయ్య తెలిపారు. ఇదే విధమైన ధోరణి కొనసాగితే బీసీలంతా ఏకతాటిపైకి వస్తే, రాజకీయంగా ఎలాంటి ఫలితం వస్తుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రొద్దుటూరులో మంచి రాజకీయ వాతావరణం నెలకొల్పి, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించేందుకు అన్ని వర్గాల నాయకులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య కోరారు.













