రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్‌ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ ఆవిర్భవించిన నాటి నుంచే పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోందని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులో బీసీ జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ టికెట్ బీసీలకే కేటాయించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.
గత ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని నిలిచిన అభ్యర్థులతో పాటు, 2019 నుండి 2024 వరకు పార్టీకి అండగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి సహకరిస్తున్న నిబద్ధత గల నాయకులకు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు కేటాయించాలని కోరారు. అధిష్టానం ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఖరారు చేసినా, స్థానిక నాయకులందరం సమిష్టిగా పనిచేసి టీడీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లపై రాచమల్లు నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్‌లో జరిగిన అవినీతిపై తొలిసారి గళం విప్పింది తానేనని ఆయన గుర్తుచేశారు.
గతంలో ఎస్.ఎస్ మాల్‌కు అక్రమంగా రుణం మంజూరు చేయించింది రాచమల్లు శివప్రసాద్ రెడ్డే కాదా అని ప్రశ్నించారు. ఈ మొత్తం అవినీతి వ్యవహారంపై ప్రభుత్వం మరియు టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తూ, ఈ విషయంపై తన సవాల్‌ను జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.













