వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బీసీల రిజర్వేషన్ల పెంపుపై తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లను గతంలో ఉన్న 24 శాతం నుంచి 34 శాతానికి పెంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని ప్రొద్దుటూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్ల రాజగోపాల్ యాదవ్ పేర్కొన్నారు.

ప్రొద్దుటూరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ తిరిగి కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రిజర్వేషన్ల అంశంపై ఎవరు న్యాయస్థానాలను ఆశ్రయించినా ప్రభుత్వం 34 శాతం నిబంధనతోనే ప్రజల ముందుకు వెళ్లి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం బీసీ నాయకులు బొర్రా రామాంజనేయులు మాట్లాడుతూ, పార్టీ మేనిఫెస్టో ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు భవిష్యత్తులో చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆకాంక్షించారు. ప్రొద్దుటూరులో బీసీల ప్రాబల్యం ఎంతో అధికమని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విజయానికి కూడా బీసీల ఓట్లే కీలకపాత్ర పోషించాయని గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే చైర్మన్ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమాజం నుంచి ఎవరైనా చైర్మన్ పదవికి ముందుకు వస్తే తామంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

మరో నేత భేపారి జాకీర్ మాట్లాడుతూ, రిటైర్డ్ IAS అధికారి రాజీవ్ రంగన్ మిశ్రా నేతృత్వంలోని సమగ్ర సర్వే ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనిపై ఓర్వలేక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టులను ఆశ్రయిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

మార్కెట్ యార్డ్ ఇంచార్జీ చైర్మన్ పట్నం లక్ష్మణ్, వాల్మీకి కుల డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ, మొదటి నుంచీ బీసీలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత కూటమి హయాంలోనూ రాజకీయ, నామినేటెడ్ పదవుల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తోందని పేర్కొన్నారు.

గత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో బీసీలు తీవ్ర అణచివేతకు, అన్యాయానికి గురయ్యారని వారు విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు పోటీ చేసే ప్రతి వార్డులోనూ విజయకేతనం ఎగురవేస్తామని ఉద్ఘాటించారు.