కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో భారీ నగదు పట్టివేత జరిగింది. గురువారం సాయంత్రం వాహనాల తనిఖీల సందర్భంగా పోలీసులు 2.52 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా ఈ నగదు బయటపడింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. వాహనాన్ని ఆపి చెక్ చేయగా 500 రూపాయల నోట్ల రూపంలో మొత్తం 2.52 కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. నగదు మూటలుగా కారులో దాచినట్లు పోలీసులు తెలిపారు.

ప్రాథమిక విచారణలో ఈ ఇద్దరు తమను ప్రొద్దుటూరు కు చెందిన బంగారు వ్యాపారి మీరావలి గుమాస్తాలమని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. గుంతకల్లులో శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి, అక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నామని వారు తెలిపినట్లు సమాచారం.

అయితే ఈ భారీ మొత్తంలో నగదుకు సంబంధించి ఎలాంటి బిల్లులు, రసీదులు లేదా ఆధార పత్రాలు చూపించలేకపోయారు. నగదు మూలం, లావాదేవీ వివరాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో ఎర్రగుంట్ల పోలీసులు మొత్తం 2.52 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసి, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని స్టేషన్ కు తరలించి మరింత విచారణ చేపట్టారు. నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వద్ద నుంచి తీసుకున్నారు, ఎవరికి ఇవ్వాల్సి ఉంది వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ, డబ్బు మూలం, లావాదేవీ వివరాలన్నింటినీ ఖచ్చితంగా విచారించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సహచరులకు సూచించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదాయపు పన్ను శాఖకు కూడా ఈ పట్టివేతపై సమాచారం అందజేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.