కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 29 నెలలు గడిచినా, అర్హులైన లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రజలను నమ్మబలికిన ప్రభుత్వం, నేటికి 900 రోజులు పూర్తవుతున్నా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

అర్హులైన పేదలకు 29 నెలలుగా పింఛన్లు ఎందుకు ఇవ్వలేదో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదల జీవనాధారంగా ఉన్న సామాజిక పింఛన్లను ఇంతకాలం నిర్లక్ష్యం చేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇన్నాళ్లూ పేదల పింఛన్ల గోడు పట్టించుకోని కూటమి నేతలకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతోనే పింఛన్ దరఖాస్తుల వ్యవహారం గుర్తొచ్చిందని రాచమల్లు ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ నాయకులు పింఛన్ దరఖాస్తుల పేరిట నానా హడావిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

క్షేత్రస్థాయిలో పింఛన్ దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు వాటిని అందించాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలపై ఉందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి అధికారిక ప్రక్రియలో టీడీపీ నాయకుల జోక్యం, పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అధికారుల అధికారాలను లాక్కొని టీడీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం పింఛన్లను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.