రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు రూరల్: మండల పరిధిలోని చౌడూరు ఏటిలో ఇసుక అక్రమ రవాణా నిర్బంధంగా కొనసాగుతోంది. గ్రామ పరిసరాల్లో పట్టపగలే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చౌడూరు నుండి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పరుగులు తీస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఏటిలో ఉచితంగా లభించే ఇసుకను అక్రమంగా తవ్వించి, రవాణా చేసి, బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ కొందరు వ్యక్తులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు. ఒక్కొక్కరు లక్షల రూపాయలు గడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల గ్రామ పరిసరాల్లో సహజ వనరులు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా చౌడూరు ఏరు తీవ్రంగా దెబ్బతింటోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. నిరంతరం భారీ లోడుతో ట్రాక్టర్లు సంచరించడం వల్ల గ్రామీణ రహదారులన్నీ గుంతలమయంగా మారిపోయాయని వారు చెబుతున్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా సాధారణ వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో రాకపోకలు సాగించే ప్రజలు, విద్యార్థులు, రైతులు రోజువారీ ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో ఈ గుంతలు నీటితో నిండిపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై అధికారుల అలసత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చౌడూరు గ్రామ సచివాలయం ఎదుటగానే ట్రాక్టర్లు వెళ్తున్నా, పట్టించుకునే వారు లేరని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక పోలీసు వ్యవస్థ ఈ అక్రమ రవాణాపై కన్నెత్తి చూడకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇసుకను కాపాడండి మహాప్రభో
అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు, రైతులు ఈ విధంగా మొరపెట్టుకుంటున్నారు. చౌడూరు ఏటిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. సహజ వనరుల సంరక్షణకు, గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.













