ప్రొద్దుటూరు: ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఏ విడుదల చేయడం పట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాపై గణనీయమైన ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, ఉద్యోగుల జీతభత్యాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతుకు ప్రతిగా ఉద్యోగులందరూ తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణలో ఉద్యోగులు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థపై మరింత సానుకూల అభిప్రాయం పెరిగేలా ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరిపి సఫలీకృతులైన ఉద్యోగ సంఘాల నాయకులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.