రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: పేద కుటుంబాలు అత్యవసర వైద్య అవసరాల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా మారిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 32వ విడతగా మొత్తం 53 మంది లబ్ధిదారులకు రూ.39,27,232 విలువైన చెక్కులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఈ నిధి పెద్ద తోడ్పాటుగా నిలుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భారం తగ్గుతోందని ఆయన అన్నారు.లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత మంది అర్హులకు చేరేలా చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర షైక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, టీడీపీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిన ఆర్థిక సహాయంతో తమ వైద్య చికిత్సలు కొనసాగించేందుకు వీలు కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.













