రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలోని పురసేవ కేంద్రంపై మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేంద్రానికి చేరుకున్న కమిషనర్, అక్కడి సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న పౌర సేవల స్థితిగతులు, దరఖాస్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ, పెండింగ్ దరఖాస్తులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ తనిఖీ సందర్భంగా ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం, విధుల నిర్వహణలో అలసత్వం వంటి అంశాలపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి, సిబ్బంది ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ఆయన స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతూ, ప్రభుత్వ విధానాలు లేదా ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. విధి నిర్వహణకు విరుద్ధంగా వ్యవహరించడం, కార్యాలయ క్రమశిక్షణను ఉల్లంఘించడం, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం, సిబ్బంది బాధ్యతలకు విరుద్ధంగా ప్రవర్తించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.
“ప్రభుత్వం జీతం చెల్లిస్తున్న ఉద్యోగి ప్రభుత్వ సేవకుడిగా విధులు నిర్వర్తించాలి. విధుల్లో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సిబ్బంది తీరు మారకపోతే సంబంధిత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది” అని కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రజలకు అందాల్సిన పౌర సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారిని, సిబ్బందిని బాధ్యులుగా గుర్తించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఇకపై పురసేవ కేంద్రం పనితీరు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
పురసేవ కేంద్రంలో పరిశుభ్రత, ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సిబ్బంది పని విధానం తదితర అంశాలను కూడా కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన పౌర సేవలు అందించడమే ప్రొద్దుటూరు పురపాలక సంఘం ప్రధాన లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు.













