రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దటూరు:- కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య తీవ్రంగా విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరు CPI కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక ధరలు, నిరుద్యోగం, కనీస వేతనాల సమస్య, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర CPI ప్లీనరీ సమావేశాలను సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు కడపలో తొలిసారిగా నిర్వహించనున్నట్లు రామయ్య తెలిపారు. ఈ ప్లీనరీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులపై విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన వివరించారు.
ప్లీనరీ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా పోరాటాల రూపకల్పన, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని CPI నేతలు సమావేశంలో సూచించినట్లు సమాచారం. అధిక ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం, కనీస వేతనాల అమలు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే డిమాండ్లతో పార్టీ ఉద్యమాలను కొనసాగించనున్నట్లు రామయ్య సమావేశంలో పేర్కొన్నారు.
ప్రొద్దుటూరులో జరిగిన ఈ సమావేశంలో CPI పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు పాల్గొన్నారు. పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరై ప్లీనరీ ఏర్పాట్లు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.













