రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: చాపాడు మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం విజయవంతంగా నిర్వహించినట్లు నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి.ఓబులేసు, చాపాడు యంపి డి ఓ మధుసూదన్ తెలిపారు. హాస్టల్ విద్యార్థులతో పాటు 1–19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చిన్న గురువలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా సమర్థవంతంగా అమలు చేసినట్లు యంపి డి ఓ మధుసూదన్, డాక్టర్ ఓబులేసు వివరించారు. నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ, ప్రభుత్వ–ప్రైవేట్ తేడా లేకుండా మాత్రలు అందజేశారు.
ఒక సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి ఒక్కరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని డాక్టర్ పి.ఓబులేసు పేర్కొన్నారు. ఈ మాత్రలు పరాన్నజీవి పురుగులను తొలగించడానికి ఉపయోగించే ఔషధమని, పురుగుల నుండి రక్షణ కల్పించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని వైద్యులు వివరించారు. మాత్రను బాగా నమిలి మింగి, తర్వాత శుద్ధమైన నీళ్లు తాగాలని సూచించారు.
నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి తగ్గడం, నీరసం, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, చదువు–ఆటల్లో ఏకాగ్రత తగ్గడం, పిల్లల ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య సిబ్బంది తెలిపారు.
యంపి డి ఓ మధుసూదన్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం చేసిన ఒక గంట తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. వయస్సు ప్రకారం మోతాదును నిర్ణయించినట్లు తెలిపారు. 1–2 సంవత్సరాల పిల్లలకు అర మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించగా, 2–3 సంవత్సరాల వారికి ఒక పూర్తి మాత్రను పొడి చేసి నీటిలో కలిపి ఇచ్చారు. 3–19 సంవత్సరాల వయస్సు గల వారికి ఒక పూర్తి మాత్రను బాగా నమిలి నీటితో మింగేలా చేశారు.
నులిపురుగుల నివారణకు పరిశుభ్రత అత్యంత కీలకమని వైద్యులు సూచించారు. మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించడం, భోజనం ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం, బయట ఆడేటప్పుడు, టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు చెప్పులు ధరించడం, గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించి శుభ్రంగా ఉంచడం, సురక్షితమైన తాగునీటిని ఉపయోగించడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, పండ్లు–కూరగాయలను బాగా కడిగి తినడం, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా నులిపురుగుల సమస్యను తగ్గించవచ్చని తెలిపారు.
లక్ష్మీపేట సచివాలయం పరిధిలోని కేతవరం గ్రామంలో డాక్టర్ పి.కావ్య మాధురి ఆధ్వర్యంలో 1–19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించినట్లు సమాచారం. పిల్లల ఆరోగ్యం అందరి బాధ్యత అనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి యం.రాఘవయ్య, సూపర్ వైజర్లు ప్రసాద్, భవానీ, పాఠశాలల ఉపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ అధికారి నాగకుమార్, వారి సిబ్బంది, యం ఎల్ హెచ్ పి శివమ్మ, ఎ ఎన్ యం చంద్రకళ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, 104 సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.













