ప్రొద్దుటూరు: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించేందుకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు, ఉత్సవ కమిటీలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలు, విద్యుత్ భద్రత, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో సూచించారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే వినాయక విగ్రహాలను పూర్తిగా నిషేధించాలని పీస్ కమిటీ స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్సవ కమిటీలకు, నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు.

ప్రొద్దుటూరు పట్టణంలో వినాయక విగ్రహాల మండపాల ఏర్పాటుకు 2026 సెప్టెంబర్ 12వ తేదీలోపు తప్పనిసరిగా సంబంధిత అనుమతులు పొందాలని నిర్వాహకులకు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయకుండా నిర్వాహకులు అధికారులకు సహకరించాలని కోరారు.

ప్రతి వినాయక మండపాన్ని అధికారులు కచ్చితంగా పర్యవేక్షించాలని సమావేశంలో నిర్ణయించారు. మండపాల వద్ద విద్యుత్ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, శాంతిభద్రతలు, పారిశుధ్యం తదితర అంశాలను నిరంతరం పరిశీలించేందుకు సంబంధిత శాఖల సిబ్బందిని నియమించనున్నారు.

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని వినాయక విగ్రహాల మండపాల వద్ద లైవ్ శానిటేషన్ అమలు చేయనున్నట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. మండపాల పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అన్ని వర్గాల ప్రజలు, ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు అధికారులకు సహకరిస్తూ సోదరభావం, సమన్వయం, శాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను విజయవంతం చేయాలని పీస్ కమిటీ సభ్యులు కోరారు.

ఈ సమావేశంలో ఎమ్మార్వో డి. ఉదయ్ భాస్కర్ రాజు, 1 టౌన్ సీఐ కొండా రెడ్డి, 2 టౌన్ సీఐ వంశీధర్, 3 టౌన్ సీఐ రామాంజనేయుడు, ట్రాఫిక్ సీఐ భాస్కర్, ఆర్ అండ్ బి డి.ఈ. పి. లక్ష్మీ నరసింహులు, ఫైర్ డిపార్ట్మెంట్ పి. బాసవి రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డా. పి. రూపానంద్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ చాంద్ బాషా, అంజుమన్ కమిటీ ప్రతినిధులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.