రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లో విద్యుత్ సర్వీస్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, చట్టంతో సంఘర్షణలో ఉన్న ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ యు. విభు కృష్ణ తెలిపారు.
బుధవారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. రూరల్ సీఐ ఎం. నాగభూషణ్, ఎస్సై కె.సి. రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టి, ముఠాను పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
నిందితులు గత ఏడాది కాలంగా రాత్రివేళల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి, గుజరీ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడిందని ఏఎస్పీ తెలిపారు. విద్యుత్ సర్వీస్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు సంబంధించిన కాపర్ వైర్లను లక్ష్యంగా చేసుకుని ముఠా చోరీలు జరిపినట్లు దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు.
నిందితుల నుంచి రూ.5.40 లక్షల నగదు, 56 కిలోల అల్యూమినియం వైర్లు, 5 కిలోల కాపర్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అలాగే చోరీలకు ఉపయోగించిన ఆటో, ద్విచక్ర వాహనాలు, పనిముట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠాకు సహకరించిన పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోందని ఏఎస్పీ చెప్పారు. ఇతర ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ చోరీలతో ఈ నిందితులకు సంబంధం ఉందేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని ప్రజలకు ఏఎస్పీ సూచించారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ ఎం. నాగభూషణ్, ఎస్సై కె.సి. రాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఏఎస్పీ యు. విభు కృష్ణ అభినందించారు.













