రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
విదేశీ పౌరుల వసతి వివరాలు ఫారం–IIIలో ఆన్లైన్ నమోదు తప్పనిసరి: వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోలీసు శాఖ
కడప, అక్టోబర్ 11: జిల్లాలో విదేశీ పౌరులు, ఓవర్సీస్ సిటిజెన్ అఫ్ ఇండియా (OCI) కార్డుదారులకు వసతి కల్పించే అన్ని సంస్థలు ఫారం–IIIలో ఆన్లైన్ నమోదు నిబంధనలను కచ్చితంగా పాటించాలని వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోలీసు శాఖ సూచించింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ రూల్స్–2025, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ ఆర్డర్స్–2025 ప్రకారం ఈ బాధ్యతలు చట్టబద్ధంగా విధించబడ్డాయని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. పేర్కొన్నారు.
విదేశీ పౌరులు, OCI కార్డుదారులకు వసతి కల్పించే హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లు, హోమ్‌స్టేలు, పేయింగ్ గెస్ట్ వసతులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మతపరమైన సంస్థలు, సేవా సంస్థలు తదితర వసతి ప్రాంగణాల నిర్వాహకులు వారి రాక, బస, వసతి వివరాలను ఫారం–III (గతంలో ఫారం–C)లో నిర్దేశిత ఆన్లైన్ పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
విదేశీ పౌరుడు వసతి ప్రాంగణానికి చేరుకున్న వెంటనే సాధ్యమైనంత త్వరగా, ఏ పరిస్థితుల్లోనూ వసతి కల్పించిన సమయం నుంచి 24 గంటలు దాటకుండా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ and ఆయుష్ వీసా పోర్టల్ ద్వారా ఫారం III ఎంట్రీ, ఇన్విటేషన్ లెటర్ జనరేషన్ చేయాలని సూచించింది.
ఫారం–III ఆన్లైన్ నమోదు కోసం https://indianfrro.gov.in/frro/FormC/login.jsp పోర్టల్‌ను వినియోగించాలి. అలాగే, సమర్పించిన వివరాలకు సంబంధించిన రికార్డులను కనీసం ఒక సంవత్సరం పాటు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025లోని సెక్షన్ 8 ప్రకారం ఫారం–III సమర్పించడం తప్పనిసరి. ఈ నిబంధనలను పాటించకపోవడం, వివరాలను నిర్ణీత సమయంలో నమోదు చేయకపోవడం లేదా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
చట్టంలోని సెక్షన్ 23(b) ప్రకారం, ప్రతి ఉల్లంఘనకు వ్యక్తులు, వాణిజ్య వసతి సంస్థలకు కనీసం రూ.50,000 జరిమానా, విద్యా మరియు వైద్య సంస్థలకు కనీసం రూ.1,00,000 జరిమానా విధించే అవకాశం ఉంది. అవసరమైతే నిబంధనల ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా పోలీసు శాఖ పేర్కొంది.
జిల్లాలో నివసిస్తున్న విదేశీ పౌరులు, OCI కార్డుదారులు భారతదేశంలో అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. భారతీయ పౌరులకు మాత్రమే వర్తించే గుర్తింపు పత్రాలను పొందడం, అర్హత లేకుండా ఓటర్లుగా నమోదు కావడం, ఎన్నికల్లో పాల్గొనడం, వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
విదేశీ పౌరులకు వసతి కల్పించే అన్ని సంస్థల నిర్వాహకులు ఫారం–IIIలో వివరాలను నిర్ణీత గడువులోపు నమోదు చేసి, సంబంధిత రికార్డులను భద్రపరచాలని జిల్లా పోలీసు శాఖ సూచించింది. నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తూ, విదేశీ పౌరుల వివరాల డిజిటల్ నమోదులో పోలీసు మరియు సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.
జిల్లా పోలీసు కార్యాలయం, కడప.













