రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు : వైఎస్సార్ కడప జిల్లాలో గంజాయి వ్యాపారం ఆందోళనకరంగా విస్తరిస్తోంది. పొరుగు జిల్లాలు, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా గంజాయి దిగుమతి చేసి యువత, ముఖ్యంగా కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్, పోలీసు శాఖలు గుర్తిస్తున్నాయి. తరచూ దాడులు, అరెస్టులు జరుగుతున్నప్పటికీ ఈ దందా ఆగేలా కనిపించడం లేదు.
అక్రమార్కులు ఒడిశా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలు, రైలు మార్గాల ద్వారా కిలోల కొద్దీ గంజాయి తెప్పిస్తున్నారు. అనంతరం వాటిని చిన్న చిన్న పొట్లాలుగా విభజించి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ఆర్టీపీపీ, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారం ఎక్కువగా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.
గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడిన వారికి అవగాహన కల్పించి, కౌన్సెలింగ్ ద్వారా వ్యసనాన్ని తగ్గించే మద్యం, డ్రగ్స్ విముక్తి కేంద్రం ప్రొద్దుటూరులో లేకపోవడం మరో సమస్యగా మారింది. ఈ కారణంగా అలవాటు మానుకోవాలనుకునే వారు కడపలోని రిమ్స్‌కు వెళ్లి వైద్యుల కౌన్సెలింగ్, చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. జిల్లా తర్వాత కీలక కేంద్రంగా ఉన్న ప్రొద్దుటూరులో ఇలాంటి విముక్తి కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైద్య కళాశాల ఉన్నచోటే ఆ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ నెల 17న ప్రొద్దుటూరులో కమలాపురం మండలం సంబటూరుకు చెందిన గంజాయి విక్రేతను ఎక్సైజ్ సీఐ సురేంద్రరెడ్డి, సిబ్బంది అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. యువత, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది.
ఇటీవల కడపలో పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ హోంగార్డు గంజాయి దందాలో పాల్గొన్న విషయం వెలుగుచూసింది. ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి కిలోల కొద్దీ గంజాయి తెప్పించి, స్థానికంగా ఉన్న మరికొందరి సహాయంతో విక్రయిస్తున్నాడని నిఘా పెట్టిన పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు.
గతేడాది ప్రొద్దుటూరు–దువ్వూరు మార్గంలో ముగ్గురు యువకులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.45 వేల విలువైన ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మద్యానికి బానిసైన ప్రొద్దుటూరు పట్టణం పెన్నానగర్‌కు చెందిన ఓ యువకుడు గతేడాది ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల వ్యవధిలో ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో మరో యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. గంజాయి అలవాటు కారణంగా మరికొందరు అనారోగ్యానికి గురై మృతి చెందిన ఘటనలూ నమోదయ్యాయి.
జిల్లాలో గంజాయి వ్యసనం పెరుగుతుండటంతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని, యువత భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణా, విక్రయాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటు, అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













