వైఎస్సార్ కడప జిల్లాలో గోపవరం గ్రామపంచాయతీకి సంబంధించిన ఫిర్యాదుపై విచారణలో జాప్యం జరుగుతోందని పసిడి అక్షరాలు వారపత్రిక ఎడిటర్ టప్పా షాకీర్ హుస్సేన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరుతూ ఈ నెల 12న జిల్లా పంచాయతీ అధికారి (డిపిఒ) కార్యాలయంలో ఆయన వినతిపత్రం సమర్పించారు.

గోపవరం గ్రామపంచాయతీపై వచ్చిన ఫిర్యాదును దర్యాప్తు చేయాలని అధికారులు ఇచ్చిన ఆదేశాలు, ఆఫీసు నుంచి జారీ చేసిన సూచనాపత్రాల వివరాలను ఆయన వెల్లడించారు. జమ్మలమడుగు మండల పంచాయతీ అధికారి నూర్జహాన్‌ను విచారించాలంటూ సూచన పత్రం నెం. 2549/A2-2026, తేదీ 24-08-2026న జారీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం విచారణలో జాప్యం కొనసాగుతున్న నేపథ్యంలో మొదటి గుర్తు (రిమైండర్-1) 18-09-2026న, చివరి గుర్తు (రిమైండర్) 07-10-2026న జారీ చేసినప్పటికీ, ఇప్పటికీ విచారణ పూర్తికాలేదని ఆయన తెలిపారు.

అక్టోబర్ 8న ఫోన్ ద్వారా కార్యాలయ సిబ్బంది తనను సంప్రదించి, అక్టోబర్ 12న గోపవరం వద్ద విచారణకు హాజరుకావాలని చెప్పారని, అయితే ఎలాంటి లిఖితపూర్వక నోటీసు ఇవ్వలేదని టప్పా షాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. అదే రోజు అత్యవసర వ్యక్తిగత పనిమీద అలగడపకు వెళ్లాల్సి వచ్చిందని, ఉదయం 11:30 గంటల సమయంలో ఫోన్ వచ్చినట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చి విచారణకు సిద్ధంగా ఉన్నానని ఫోన్‌లో తెలియజేయగా, అధికారి కడపకు బయలుదేరుతున్నారని కార్యాలయ సిబ్బంది చెప్పినట్లు ఆయన వివరించారు.

తనకు తెలిసిన మేరకు మాజీ పంచాయతీ కార్యదర్శి ఎరుకల గుర్తుమోహన్, కంప్యూటర్ ఆపరేటర్ జింకా చెన్నకేశవ విచారణకు హాజరైనట్లు సమాచారం అందిందని ఆయన చెప్పారు. అయితే కంప్యూటర్ ఆపరేటర్ భార్య లింగంపల్లి సునంద, మాజీ ప్రత్యేకాధికారి సి. సుబ్రహ్మణ్యం కూడా విచారణకు పిలిచారా లేదా అన్న విషయంపై సందేహాలు వ్యక్తం చేశారు.

గోపవరం పంచాయతీ ఫిర్యాదుపై జరుగుతున్న విచారణలో పారదర్శకత కోసం తాను కొన్ని సూచనలు చేసినట్లు టప్పా షాకీర్ హుస్సేన్ తెలిపారు. విచారణకు సంబంధించి తనకు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలని, అందులో తేదీ, సమయం, స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలని కోరారు. అలాగే సాక్ష్యాధారాలు సమర్పించే అవకాశం కల్పించాలని, సంబంధిత వ్యక్తులందరిని విచారించి, రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని, తుది నివేదికను లిఖితపూర్వకంగా తనకు తెలియజేయాలని డిపిఒ కార్యాలయాన్ని అభ్యర్థించారు.