ప్రొద్దుటూరు, జూన్ 13: గతంలో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది పేద లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు ఆర్&బి అతిథి గృహంలో జిల్లా హౌసింగ్, రెవెన్యూ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కూడా పాల్గొన్నారు.

హౌసింగ్ లేఅవుట్లలో గృహ నిర్మాణాల పురోగతి, పెండింగ్ పనులు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు, సిబ్బంది చేసిన నిర్వాకం వల్ల పేదలు నష్టపోయారని, పేదల కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరిపి స్వాహా చేసిన కోట్ల రూపాయలను తిరిగి రికవరీ చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. మెప్మా మహిళా సంఘాలు, హౌసింగ్ నిర్మాణాలకు సంబంధించిన నిధుల వినియోగంపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ, ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరని, బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని బొల్లవరం, రామేశ్వరం, మీనాపురం హౌసింగ్ లేఅవుట్లలో ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రానున్న సెప్టెంబర్–అక్టోబర్ నాటికి పెండింగ్ గృహాలన్నీ పూర్తి చేసి లబ్ధిదారులు కాలనీల్లో నివాసం ఉండేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

పేదల సొంతింటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, ప్రతి అర్హ లబ్ధిదారుడు తన ఇంటిలో నివసించే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు.

సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని హౌసింగ్ లబ్ధిదారుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించి పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష, హౌసింగ్ సీఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడి రాజారత్నం, తహశీల్దార్ ఉదయ భాస్కర్, హౌసింగ్ డీఈలు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.