చాపాడు మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పి‌వి టీకా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. డాక్టర్ పి. ఓబులేసు, డాక్టర్ పి. కావ్య మాధురి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు హెచ్‌పి‌వి వ్యాక్సిన్ ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు.

నక్కలదిన్నె వైద్యాధికారి డాక్టర్ పి. ఓబులేసు తెలిపారు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణలో హెచ్‌పి‌వి టీకా కీలక పాత్ర పోషిస్తుందని, నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా నిర్వహించామని చెప్పారు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు.

బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పి‌వి టీకా మందును అందజేస్తోందని డాక్టర్ ఓబులేసు వివరించారు. ఈ నెల 7 తేదీ వరకు హెచ్‌పి‌వి వ్యాక్సిన్‌ను ఉచితంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వేస్తున్నట్లు తెలిపారు. టీకాలు వేయించుకున్న ప్రతి బాలికకు టీకా వేసుకున్నట్లు ధృవీకరణ పత్రం అందజేస్తున్నామని ఆయన చెప్పారు.

అనంతరం మహిళా వైద్యురాలు డాక్టర్ కావ్య మాధురి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఆడపిల్లలకు హెచ్‌పి‌వి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తోందని, అర్హత గల పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సాహించి తప్పకుండా టీకా వేయించాలన్నారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ వ్యాక్సిన్ వలన కలిగే ప్రయోజనాలను బాలికలకు, వారి తల్లిదండ్రులకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వివరించారు. చిన్న గురువలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అయ్యవారి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఈ కార్యక్రమంలో టీకాలు అందించారు.

మొత్తం 31 మంది బాలికలకు హెచ్‌పి‌వి టీకాలు వేసినట్లు డాక్టర్ పి. ఓబులేసు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి యం. రాఘవయ్య, డిప్యూటి హెచ్‌ఈఓ జయ ప్రకాశ్, సూపర్‌వైజర్, విద్యార్థులు పాల్గొన్నారు.