ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 27, 2026: ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ చేపడుతున్న చర్యలను అభినందిస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.

ప్రొద్దుటూరు పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కమిషనర్‌కు శాలువా కప్పి సన్మానించారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సంబంధిత ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్న విధానం అభినందనీయమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

“ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ఆ లక్ష్యం నెరవేరడానికి ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకున్నాను. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సియర్ సహకారంతో రీల్స్ వైరల్ కావడంతో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు సంకల్పం ప్రజల వద్దకు త్వరగా చేరింది. మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం, నిషేధిత ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం వంటి అంశాల్లో ప్రజల సహకారం, స్వచ్చంద సేవ సంస్థల సమిష్టి కృషి అవసరం” అని కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు.

ప్రజలు, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు మరియు సంబంధిత ప్రభుత్వం శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించగలమని కమిషనర్ తెలిపారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత విధానాలను అవలంబించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు అడ్వైజరీ కమిటీలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పట్టణంలో ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత సమన్వయంతో నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని కమిషనర్ వివరించారు.

మున్సిపల్ యంత్రాంగం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ వి మునిశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీమతి వి కళావతి, డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.