ప్రొద్దుటూరు త్రీ టౌన్ ఎస్సై నాగకీర్తనను కలిసిన లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు

ప్రొద్దుటూరు పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన మహిళా ఎస్సై నాగకీర్తనను లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిబరేషన్ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సంస్థ ఫౌండర్ మరియు నేషనల్ చైర్మన్ జి.పి.నరసింహులు ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ చైర్మన్ జె.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్సై నాగకీర్తనకు శాలువా కప్పి సన్మానించి, స్వీట్స్ అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మహిళా భద్రత, సోషల్ మీడియా వినియోగం, యువతిలో అవగాహన పెంపు వంటి అంశాలపై చర్చించారు.

లోకాసమస్త హ్యూమన్ రైట్స్ ఏపీ స్టేట్ చైర్మన్ జె.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు సోషల్ మీడియా వినియోగంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మోసపోయి, వారి జీవితాలు దెబ్బతింటున్న సందర్భాలు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

జె.శ్రీనివాసులు సంస్థ ఆధ్వర్యంలో కొన్ని పాఠశాలలు, కాలేజీలలో సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమాలకు ఎస్సై నాగకీర్తన ముఖ్య అతిథిగా హాజరై ఆడపిల్లలకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి వారికి అవగాహన కల్పించాలని, చైతన్యవంతులను చేయడంలో తన వంతు సహకారం అందించాలని కోరినట్లు ఆయన వివరించారు.

ఈ సందర్భంగా ఎస్సై నాగకీర్తన స్పందిస్తూ ఆడపిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ తరఫున తప్పకుండా తన సహకారం ఉంటుందని తెలిపారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేసినట్లు కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలిపారు.

కార్యక్రమంలో లోకాసమస్త హ్యూమన్ రైట్స్ రాయలసీమ జిల్లాల విభాగ వర్కింగ్ చైర్మన్ పి.సత్యనారాయణ, ప్రొద్దుటూరు నియోజకవర్గ మహిళా విభాగ చైర్ పర్సన్ టి.రాధ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎల్లయ్య, ప్రొద్దుటూరు పట్టణ మహిళా విభాగ చైర్ పర్సన్ షేక్ ముబారక్ తదితరులు పాల్గొన్నారు.