మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప: మైదుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, మురుగు కాలువల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో డా. శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి పురోగతిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

సమావేశంలో మైదుకూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు. తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, పట్టణ ప్రణాళిక, గృహ నిర్మాణ అనుమతులు, పట్టణ పేదల అభివృద్ధి, వివిధ అభివృద్ధి పథకాల కింద చేపడుతున్న పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.

మైదుకూరు పట్టణంలో ప్రస్తుతం భూగర్భ జలాల ఆధారంగా తాగునీటి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత తాగునీటి వనరుల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను కలెక్టర్ పరిశీలించారు. అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న తాగునీటి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పైపుల ఏర్పాటు, నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణం, నీటి శుద్ధి కేంద్రం తదితర పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మున్సిపాలిటీలో రోజువారీ తాగునీటి అవసరం, ప్రస్తుతం అందుతున్న నీటి పరిమాణం, ఉన్న లోటుపై అధికారులు వివరించారు. ప్రస్తుతం బోరు బావుల ద్వారా 3.65 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతుండగా, అవసరానికి తగ్గ నీటి లభ్యత కోసం ప్రత్యామ్నాయ, శాశ్వత వనరులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.

రహదారుల అభివృద్ధి, గుంతల పూడ్చివేత, మురుగు కాలువల నిర్మాణం, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా కాలువల్లో పూడిక తొలగింపు పనులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మైదుకూరు మున్సిపాలిటీలో వివిధ నిధులతో కొనసాగుతున్న రహదారులు, డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, చెత్త తరలింపు, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అన్న క్యాంటీన్ నిర్వహణ, ప్రజలకు అందుతున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, సిబ్బంది సేవలపై ప్రజాభిప్రాయాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి సరిదిద్దాలని సూచించారు. విద్య, వైద్య ఆరోగ్య శాఖల్లో సేవలను పటిష్ఠం చేయాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల ఖాళీలను పూరించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అమృత్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ తదితర పథకాల కింద చేపడుతున్న పనులను కూడా కలెక్టర్ సమీక్షించారు. నీటి సరఫరా మెరుగుదలతో పాటు చెత్త నిర్వహణ, వ్యర్థాల శుద్ధి, పాత చెత్త తొలగింపు, భూమి పునరుద్ధరణ వంటి పనులు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పట్టణ అభివృద్ధికి సంబంధించిన వివిధ శాఖల మధ్య అవసరమైన అనుమతులు, భూ సంబంధిత అంశాలు, ఇతర శాఖల సమన్వయంతో పరిష్కరించాల్సిన సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాలపై సమన్వయంతో చర్యలు చేపట్టి అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ... మైదుకూరు మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా అమలు చేయాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు ప్రజాప్రతినిధుల తరఫున సహకారం అందిస్తామని తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని శాఖలవారీగా సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి వాటి పరిష్కారానికి స్పష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, తహసీల్దార్ రాజ సింహా నరేంద్ర, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.