ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కార్యాలయానికి సంబంధించిన ఒక సామాజిక మధ్యమాల పోస్టు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తోంది. "ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీనా? లేక తెలుగుదేశం పార్టీ కార్యాలయమా?" అనే వ్యాఖ్యతో ప్రచారం అవుతున్న ఆ పోస్టుపై అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ & కమీషనర్, ప్రొద్దుటూరు తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తీవ్రంగా స్పందించారు.

సమాచారం అందుకున్న వెంటనే కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, అసిస్టెంట్ కమీషనర్ మంజునాధ్ గౌడ్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. విచారణ అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామవాళి ఉల్లంఘన జరిగినట్లు రుజువైతే, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తప్పవని కమీషనర్ స్పష్టం చేశారు.

మోడల్ కోడ్ అఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ఎవరినీ ఉపేక్షించబోమని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ హెచ్చరించారు. ప్రొద్దుటూరులో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినా, మోడల్ కోడ్ అఫ్ కండక్ట్‌ను అతిక్రమించినా, వారి మీద చర్యలు తీవ్రంగా ఉంటాయని కమీషనర్ హెచ్చరించారు. సహాయం కమిషనర్ మంజునాధ్ గౌడ్ ఇచ్చే విచారణ నివేదిక ఆధారంగా సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఆపకాస్ ఉద్యోగి, కాంట్రాక్టు ఉద్యోగి అయితే నిబంధనల మేరకు ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగి అయితే CCA Rules ప్రకారం, అలాగే ఎన్నికల నిబంధనల ప్రకారం క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుంటామని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ స్పష్టం చేశారు.

ప్రొద్దుటూరు పట్టణంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ సక్రమంగా అమలు కావడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని MCC ఇంచార్జి & అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణ సింగ్‌కు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా తటస్థంగా, నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆయన సూచించినట్లు మున్సిపాలిటీ వర్గాలు తెలిపాయి.