అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెంచే లక్ష్యంతో మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శివాలయం సెంటర్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ సంతకాల సేకరణ చేపట్టారు.

కార్యక్రమానికి MPJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల్లో అవినీతి వ్యతిరేక భావజాలాన్ని బలపరచడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

ప్రజాధనం-ప్రజల హక్కు.. అవినీతిని ప్రశ్నిద్దాం-జవాబుదారీతనం సాధిద్దాం

ఈ నినాదంతో ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న షేక్ సలీం, MPJ రాయలసీమ ఇన్‌ఛార్జి అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజాధనం ప్రజల సొమ్మని, దాన్ని పారదర్శకంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. అవినీతిని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని వారు అభిప్రాయపడ్డారు.

ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ప్రజల్లో మరింత చైతన్యం అవసరమని నాయకులు సూచించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ప్రజలు తమ గొంతును వినిపించాలని పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజల భాగస్వామ్యంతో MPJ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, సంతకాల సేకరణ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో MPJ జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి, పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాష, కార్యదర్శి మహమ్మద్ రఫీ, కోశాధికారి ఇస్మాయిల్‌తో పాటు నాయకులు ముక్తాయార్, లాల్ బాష, ఫర్హాన్, అన్వర్, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శివాలయం సెంటర్‌కు వచ్చిన ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు. కార్యక్రమం శాంతియుతంగా, సజావుగా కొనసాగినట్లు నిర్వాహకులు తెలిపారు.